రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత ఎంతో ముఖ్యం. ఈ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తోంది ధూళిపాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీతో మాది 40ఏళ్ల అనుబంధం. మా తండ్రి గారు స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరిగారు 1983లో టీడీపీలో చేరి.. ఆ పార్టీ సేవలోనే ప్రాణాలు కోల్పోయారు. నా తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన నాకు రాజకీయాలు నేర్పి నడిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుగారు. మీ ముందు నాయకుడిలా ఇలా నిలబడ్డానంటే అందుకు కారణం ఎన్టీఆర్ ఆశీర్వాదం, చంద్రబాబునాయుడుగారి ప్రోత్సాహమే..! నా తండ్రిగారు నాకు ఇచ్చింది ప్రజలను, ప్రజాభిమానాన్ని మాత్రమే. ఆయన నుంచి నేను నేర్చుకున్నది నమ్మిన వాళ్ల కోసం నిలబడటం, ధైర్యంగా పోరాడటమే.
తెలుగుదేశం పార్టీ అనేది తండ్రి చావు నుంచి వచ్చినది కాదు.. పదవికాంక్షతో పుట్టినదికాదు. పేదల జీవితాలను మార్చడానికి, ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టినదే తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల ఆత్మగౌరవం తెలుగుదేశం.. సంగం డెయిరీ పాడి రైతుల ఆత్మగౌరవం. ప్రభుత్వం దాడులు చేసినా, భయపెట్టినా పాల ఉత్పత్తిదారులందరూ మా వైపు నడిచారు కాబట్టే వైసీపీ కుట్రలు సాగలేదు. పాడిరైతుల నమ్మకం, ప్రజల ఆదరణ ఉన్నంతకాలం వైసీపీ ప్రభుత్వం సంగం డెయిరీని ఏమీ చేయలేదు.


